ధోనీకి ఎలా స్పాట్‌ పెట్టారంటే..

జార్ఖండ్‌ అనే రాష్ట్రం ఒకటుందని ఈ దేశానికి ధోనీ వల్లే తెలిసింది. మన దేశంలో ఖనిజాలకు రాజధాని అయిన ధన్‌బాద్‌ ఈ జార్ఖండ్‌లోనే ఉంది. ఇక్కడి గనుల్లో నుంచి వచ్చిన మేలిమి వజ్రం మహేంద్ర సింగ్‌ ధోనీ. రాంచీ నుంచి మొదలైన ఇతగాడి ప్రయాణం.. క్రికెట్లో అత్యున్నత స్థాయికి చేరుకుంది. అయితే ఏ రంగంలో అయినా పీక్‌లో ఎల్లకాలం ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. ఏదో ఒక దశలో వెనుకడుగు వేయాల్సిందే. విశ్రాంతి తీసుకోవాల్సిందే. అది సచిన్‌ టెండూల్కర్‌కు వర్తిస్తుంది. ధోనీకి వర్తిస్తుంది. మనందరికీ కూడా వర్తిస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన ధోనీ క్రికెట్‌ కెప్టెన్సీ నుంచి రిటైరయ్యారు. ఆటగాడిగా మాత్రం కొనసాగతానని చెప్పారు.

ప్రస్తుతం ధోనీకి 35 ఏళ్లు. ధోనీ కంటే వయసులో చాలా చిన్న వాడైన విరాట్‌ కోహ్లి.. బ్యాట్‌తో విశ్వరూపం చూపిస్తున్నాడు. కెప్టెన్‌గా కూడా దుమ్ము రేపుతున్నాడు. ఈ పరిస్థితుల్లో కోహ్లిని టెస్టులతో పాటు అన్ని రకాల ఫార్మాట్లకు కెప్టెన్‌గా చేయాల్సిన పరిస్థితి సెలెక్టర్లకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇకపై తాను కెప్టెన్‌గా ఉండాలనుకోవడం తెలివైన పని కాదని ధోనీ గుర్తించి కెప్టెన్సీకి రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. వన్డే వరల్డ్‌ కప్‌ని, ట్వంటీ20 వరల్డ్‌ కప్‌ని, చాంపియన్స్‌ ట్రోఫీని గెలిచి క్రికెట్‌ అభిమానులకు అంతులేని ఆనందాన్ని కలిగించిన ధీరుడు ధోని.

ధోనీ చివర్లో బ్యాటింగ్‌ వచ్చి.. సిక్సర్లు బాది అలవోకగా మ్యాచ్‌ గెలిపించే వాడు. అలాంటిది ఇటీవలి కాలంలో బ్యాట్‌తో మెరుపులు మెరిపించడంలో వెనుకబడ్డాడు. సరిగ్గా ఇదే సమయంలో కోహ్లి చేస్తున్న మాయాజాలం.. ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేస్తోంది.
మరోవైపు 2019లో జరిగే వరల్డ్‌ కప్‌కు ఇప్పటి నుంచే కెప్టెన్‌ను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని సెలెక్టర్లు భావిస్తున్నారు. కోహ్లి కెప్టెన్‌గా ఉంటే వరల్డ్‌ కప్‌ మరోసారి సొంతమవుతుందనే భావన ఇప్పుడు ఇండియన్‌ క్రికెట్లో బాగా వ్యాపించింది. ఇది ధోనీకి పెద్ద మైనస్‌ పాయింట్‌ అయింది.

ప్రస్తుతం ధోనీ పరిస్థితి చూస్తుంటే వచ్చే వరల్డ్‌ కప్‌ నాటికి ఆయన ఆటగాడిగా అయినా టీములో ఉంటాడా? అన్నది అనుమానమే. ఎందుకంటే తన జూనియర్‌ కింద ఆటలో మెరవడం అంత సులభమమైన విషయం కాదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*