థాంక్స్‌ చెప్పండి.. లేదంటే చంద్రబాబు ఫీలవుతారట!

థాంక్స్‌ చెప్పకపోతే తాను బాధపడతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆయనకు ఎందుకు థాంక్స్‌ చెప్పాలి అంటారా? తాను విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంతగానో సేవ చేస్తున్నాని.. ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేస్తున్నానని బాబు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన సభలో బాబు మాట్లాడారు. ఏపీ ప్రజలకు తాను 24 గంటలూ కరెంట్‌ ఇస్తున్నానని.. కరెంట్‌ ఆదా చేసుకోవడానికి ఎల్‌.ఇ.డి. బల్బులు సరఫరా చేశామని ఆయన తెలిపారు. ఈ బల్బు వేసినప్పుడైనా తనను గుర్తుంచుకోవాలని.. ధన్య వాదాలు చెప్పాలని బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మేలు చేసినప్పుడు థాంక్స్‌ చెప్పి ప్రోత్సహించకపోతే బాధపడతానని కూడా బాబు అన్నారు.

విభజనతో నష్టపోయిన రాష్ట్రం కోసం తాను రేయింబవళ్లు పని చేస్తున్నానని.. తాను చేస్తున్న శ్రమను గుర్తిస్తే తనకు మరింత శక్తి వస్తుందని.. తద్వారా మరింత ఉత్సాహంగా పని చేస్తానని చంద్రబాబు అన్నారు.

పనిలో పనిగా థాంక్స్‌ చెప్పిన వ్యక్తికి బాబు పండుగ చేశారు. రూ.1500లు ఫించను అందుకుంటున్న చినవల్లీ అనే వాచ్‌మ్యాన్‌ బాబు దగ్గరకు వచ్చి.. వాచ్‌మ్యాన్‌ ఉద్యోగం చేసినందుకు కేవలం రూ.1200లు ఇస్తున్నారని తెలిపారు. అలాంటిది ఫించను ద్వారా రూ.1500లు ఇస్తున్నందుకు జీవితాంతం సైకిల్‌ గుర్తుకే ఓటేస్తానని చినవల్లీ చెప్పారు. దీంతో చంద్రబాబు మోము వికసించింది. చినవల్లీకి మోటార్‌ సైకిల్‌ కొని ఇవ్వండని అధికారులను ఆదేశించారు.

పొగడ్తలు, కృతజ్ఞతలు మనిషికి భలే కిక్కు ఇస్తాయి. ఇప్పుడు చంద్రబాబు ఇవే కోరుకుంటున్నారు. చూద్దాం.. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఏం చేస్తారో!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*