వదల బొమ్మాళి.. నిన్నొదల.. పవన్ కల్యాణ్ తాజా నినాదం..

పవన్ కల్యాణ్.. ఈ మధ్య ట్విట్టర్లో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. వివిధ అంశాల మీద ఆయన తన అభిప్రాయాలను వెళ్లడిస్తున్నారు. తాజాగా పవన్.. బీజేపీ మీద విరుచుకుపడుతున్నారు. ఆ పార్టీని వదిలిపెట్టేది లేదని ప్రతినబూనుతున్నారు. అరుంధతి సినిమా డైలాగులా.. బీజేపీని వెంటాడుతానని చెబుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో మోదీ వెనక్కు తగ్గడంపై అగ్రహోదగ్రులవుతున్నారు. ఈ హోదా ఇక అసాధ్యం అని తెలిసినప్పటికీ జనంలోకి వెళ్లడానికి ఈ నినాదం పనికొస్తుందనే భావన పవన్ లో కనిపిస్తోంది.

స్పెషల్ ప్యాకేజీ తుస్సు ప్యాకేజీ అని.. హోదానే కావాలని పవన్ నినదిస్తున్నారు. బీజేపీ సీమాంధ్రులను అవమానిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. పవన్ ఎంతగా గట్టిగా మాట్లాడినా.. కేంద్రం దిగి వచ్చే అవకాశాలు లేవు. హోదా కోసం సీమాంధ్రలో చెప్పుకోదగ్గ పోరాటాలేమీ జరగలేదు. జన జీవనం స్తంభించలేదు. తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో చూశాం. ప్రత్యేక హోదా కోసం ఓ మాదిరిగా మాత్రమే ఆందోళనలు జరిగాయి.

రాని దాని కోసం ఆరాటపడటం ఎందుకనే భావన సీమాంధ్రుల్లో ఉందని అంచనా వేయొచ్చు. ప్యాకేజీ ఇచ్చామన్నారు కదా.. ముందు దానిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తే ఎంతో కొంత లాభం కలుగుతుందనే భావన వారిలో ఉంది. ఒక రకంగా ఇది పరిణతితో కూడుకున్న ఆలోచన. అసలే రాజధాని లేదు. ఆందోళనలు చేస్తూ జన జీవనం స్తంభిస్తే ఇంకా నష్టం వాటిల్లుతుంది. ఇప్పుడు సీమాంధ్రకు అత్యంత అవసరం అయింది.. పోలవరం. ఈ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం రాష్ట్రం సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంది. కేవలం పట్టిసీమ ద్వారా ఇటు కృష్ణా డెల్టాలో పూర్తి స్థాయిలో పంట చేతికొచ్చింది. అటు శ్రీశైలం నుంచి నీటిని తీసుకెళ్లి అనంతపురం జిల్లాలో చెరువుల్ని కొంత మేర నింపగలిగారు.

పోలవరం పూర్తయితే సాగర్ నుంచి కిందకు నీళ్లు వదిలాల్సిన అవసరమే ఉండదు. శ్రీశైలంలో, సాగర్ లో ఏపీ వాటాగా వచ్చే నీటిని పూర్తిగా సాగర్ కుడి కాలువ, హంద్రీ నీవీ, కేసీ కెనాల్, గాలేరు-నగరికే వాడుకోవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ కోల్పోవడం వల్ల ఏపీకి వచ్చిన నష్టాన్ని పోలవరంతో పూర్తి చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తి మీద పవన్ తరచుగా దృష్టి సారిస్తే బాగుంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*