మోదీకి మిగిలింది ఖాళీ చిప్పే!

ఈ జనరేషన్‌లో మన దేశంలో నలుమూలలా తెలిసిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో ఆయన ప్రతి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేశారు. ఈ నోట్ల రద్దుతో మోదీ ఎన్నో రకాల ప్రయోజనాలు ఆశించారు. వాటిలో తక్షణం నెరవేరాల్సినవి రెండు.. ఒకటి నల్ల డబ్బు ఉన్న వాళ్లు బయటపెట్టడం, రెండోది.. కొందరు నల్ల బడా స్వాములు నల్లడబ్బు డయటపెట్టలేకపోవడం.. తద్వారా పాత నోట్లు మురిగిపోవడం. ఈ రెండింటిలో ఏది జరిగినా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

నల్లడబ్బును బయటపెట్టడం వల్ల ట్యాక్స్‌ రూపంలో కేంద్రానికి భారీగా ఆదాయం వస్తుంది. అదే విధంగా నల్ల డబ్బును బయటపెట్టకపోయినా కేంద్రానికి లాభం కలిగేది. ఎందుకంటే పాతనోట్లపై ప్రభుత్వ బాధ్యత మార్చి 31తో తీరిపోనుంది. ఈ బాధ్యత తీరిపోవడం ద్వారా.. రిజర్వ్‌ బ్యాంకు.. కేంద్రానికి కనీసం రూ.3 లక్షల కోట్ల డివిడెండ్‌ ఇస్తుందని భావించారు. కానీ పాత నోట్లు దాదాపుగా బ్యాంకులకు చేరిపోయాయి. ఆర్బీఐ.. విడుదల చేసిన రూ.500, రూ.1000 నోట్ల విలువ రూ.15.45 లక్షల కోట్లు. ఇందులో దాదాపు రూ.15 లక్షల కోట్లు ఇప్పటికే బ్యాంకులకు చేరింది. అంటే ఆర్బీఐ.. కేంద్రానికి ఇవ్వగలిగిన డివిడెండ్‌ రూ.50 వేల కోట్లు కూడా లేదు.

ఆర్బీఐ రిలీజ్‌ చేసిన దాని కంటే ఎక్కువ మొత్తం బ్యాంకులకు వచ్చిందా? అనే అనుమానం కూడా ఉంది. కానీ రిజర్వ్‌ బ్యాంకు పక్కా లెక్కలు చెప్పడం లేదు. పాకిస్థాన్‌లో ప్రింటయిన నకిలీ కరెన్సీ కూడా ఇండియన్‌ బ్యాంకులకు చేరిందా? అనే అనుమానం ఉంది.
ఏది ఏమైనా పాత నోట్ల రద్దుతో ప్రభుత్వం తక్షణం సాధించిన ప్రయోజనం నామమాత్రం. అనవసరంగా నవంబరు 8 అర్ధరాత్రి నుంచి పాత పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించారు. అలా కాకుండా మూడు నెలలో, ఆరు నెలలో సమయం ఇచ్చి ఉంటే బాగుండేది. ఆర్థిక వ్యవస్థ పురోగతికి విఘాతం కలిగేది కాదు. జనాలకు ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఏమైంది? అటు ప్రభుత్వానికి లాభం లేకుండా పోయింది. ఇటు జనాలకు లేని పోని కష్టాలు వచ్చాయి. యథావిధిగా రూ.2 వేల నోట్లు అందుబాటులో ఉండటం వల్ల బ్లాక్‌ మనీ చెలామణిలో ఉంది. రూ.2 వేల నోటు ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత ఎక్కువగా బ్లాక్‌ మనీ చెలామణిలో ఉంటుంది. రూ.2 వేల నోటును కొనసాగించి రూ.1000 నోటును కూడా ముద్రిస్తే.. గతం కంటే ఎక్కువగా బ్లాక్‌ మార్కెట్‌ డెవలప్‌ అవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*