చిరంజీవి, బాలకృష్ణ యుద్ధానికి తెరదించిన క్రిష్‌

చిరంజీవి, బాలకృష్ణ.. ఇద్దరూ చాలా కాలం పాటు వెండితెరపై ఒకటి రెండు స్థానాల్లో కొనసాగారు. ఇద్దరి అభిమానుల మధ్య ఎన్నో సార్లు మాటల యుద్ధాలు సాగాయి. కొన్నిసార్లు గొడవలు కూడా పడ్డారు. కాలక్రమంలో కొత్త తరం రావడంతో వీరిద్దరూ వెనక్కు వెళ్లిపోయారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరంగా ఉన్నారు. చిరు ఉన్న పార్టీ ఇప్పుడు ఆంధ్రలో సోదిలో కూడా లేకుండా పోయింది. దీంతో చిరంజీవి మళ్లీ వెండితెర మీదకు వచ్చారు. అది కూడా అతిపెద్ద మైలురాయి అయిన 150వ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బాలకృష్ణ విషయానికొస్తే ఆయన సినిమాలను రాజకీయాలను సమాంతరంగా నడిపిస్తూ వస్తున్నారు. సరైన సమయంలో ఆయన ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి గెలిచారు. ఇటు సినిమాల పరంగా కూడా బాలకృష్ణకు ఐదారేళ్లుగా పరిస్థితులు కలిసి వస్తున్నాయి. సింహా, లెజెండ్‌ సినిమాలు ఆయన కెరీర్‌ను ట్రాక్‌లో పెట్టాయి. ఇప్పుడు ఆయన వందో సినిమా చేస్తున్నారు. అది గౌతమీ పుత్ర శాతకర్ణి. దీనికి క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్‌.. దర్శక, నిర్మాత కావడంతో సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

చిరంజీవి, బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక సినిమాలు ఏకకాలంలో విడుదల అవుతుండటంతో అభిమానుల్లో కోలాహలం కనిపిస్తోంది. ఇద్దరి సినిమాలు ఒకే రోజున రిలీజ్‌ అవుతాయా? అన్న అనుమానం మొదట్లో ఉండేది. కానీ గౌతమీ పుత్రను జనవరి 12న విడుదల చేయాలని క్రిష్‌ ముందుగా నిర్ణయించుకున్నారు. దీని కంటే ఒకరోజు ముందుగా ఖైదీ నెంబరు 150ని విడుదల చేయాలని చిరంజీవి కుమారుడు రాంచరణ్‌ నిర్ణయించుకున్నారు. బాలకృష్ణ సినిమా ఒక రోజు ఆలస్యం కావడంతో ఆయన అభిమానులు ఒత్తిడికి లోనవుతున్నారు. తమ హీరో సినిమా కూడా 11నే రిలీజ్‌ చేయాలని పట్టుబడుతున్నారు. ఈ వివాదానికి క్రిష్‌ తెరదించాడు.

చిరంజీవిని, బాలకృష్ణను క్రిష్‌.. లెజెండ్స్‌గా సంబోధిస్తూ.. ఇద్దరి ల్యాండ్‌ మార్క్‌ ఫిల్మ్స్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెబుదామని క్రిష్‌.. ట్వీట్‌ చేశారు. గౌతమీ పుత్ర శాతకర్ణి 12నే రిలీజ్‌ అవుతుందని తెలిపారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*