రాయలసీమ రెడ్లపై జేసీ సంచలన వ్యాఖ్యలు.. విశ్లేషణ

సంచలన వ్యాఖ్యలకు మారుపేరైన జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలనాత్మక, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు వరప్రదాయిని అయిన మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జేసీ.. జగన్‌పైన, రాయలసీమ రెడ్లపైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముందుగా జగన్‌ గురించి అన్న మాటలను చూస్తే.. ‘మా వాడు జగన్‌ ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. కృష్ణా డెల్టాతో పాటు రాయలసీమకు ఉపయోగపడే పట్టిసీమ లాంటి ప్రాజెక్టును ఎవడైనా వ్యతిరేకిస్తాడా?’ అని ప్రశ్నించారు. గతంలో జగన్‌ పట్టిసీమ వద్దు పోలవరమే కావాలని డిమాండ్‌ చేశారు. పట్టిసీమ కట్టి పోలవరంపై చంద్రబాబు మోసం చేయాలని చూస్తున్నారని జగన్‌ అప్పట్లో ఆరోపించారు. పోలవరం సంగతి ఎలా ఉన్నా పట్టిసీమ వల్ల కృష్ణాడెల్టాకు ఎనలేని మేలు జరిగింది. చాలా కాలం తరువాత డెల్టా మొత్తానికి నీరందింది. భారీగా దిగుబడి కూడా వచ్చింది. ఎకరాకు 40 నుంచి 45 బస్తాల దిగుబడి వచ్చింది. గోదావరి నీటి వల్ల కృష్ణా పొలాలకు అధిక బలం చేకూరింది.

జేసీ రాయలసీమ రెడ్లపై తీవ్రమైన వ్యాఖ్య చేశారు. సీమ రెడ్లకు కులపిచ్చి ఎక్కువని ఆయన వ్యాఖ్యానించారు. ఖర్మకొద్దీ రెడ్లంతా సీమలోనే ఉన్నారని కూడా చెప్పారు. జగన్‌ తమ వాడని రెడ్లంతా ఆయన వెంట వెళుతున్నారని తెలిపారు. జగన్‌ దగ్గర ఏమీ లేదని తెలిసి ఇప్పుడు రెడ్లు ఆయన్నుంచి దూరంగా వస్తున్నారని విశ్లేషించారు. కులం కూడు పెట్టదని ఈ సందర్భంగా జేసీ చెప్పారు. చంద్రబాబు ఏ కులం వాడని సీమకు మేలు చేస్తున్నాడు? అని ఆయన ప్రశ్నించారు. అనుభవజ్ఞడు, దూరదృష్టి ఉన్న వ్యక్తి అయినందున.. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించి టీడీపీలో చేరానని చెప్పారు.

పనిలో పనిగా జేసీ.. ఎన్టీఆర్‌ను కూడా ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్టీఆర్‌ హయాంలో శివరామకృష్ణ అనే ఇంజినీర్‌ తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా అనే ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని.. ఆనాడవి పిచ్చి గీతలనుకున్నామని.. కానీ ఈనాడు ఈ ప్రాజెక్టుల ద్వారా సీమకు నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఎన్టీఆర్‌ ఎంతో ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఎంతో మేలు జరుగుతోందని చెప్పారు.

సీమ రెడ్లకు కులపిచ్చి ఉంది అనే మాట జేసీ అనకుండా ఉండాల్సింది. ఏ కులం వారికి లేదు కులపిచ్చి. ప్రతికులం వారికి వారి వారి కులం మీద అభిమానం ఉంటుంది. అంత మాత్రం చేత దాన్ని పిచ్చి అని గజ్జి అని అనడం సమంజంసం కాదు. ప్రతి కులమూ ఈరోజు మాకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్‌ చేస్తోంది. ఎవరికి వారు తమ కులం గొప్పదని భుజాలు చరుచుకుంటున్నారు. అందువల్ల రాయలసీమ రెడ్లకు మాత్రమే కుల పిచ్చి ఉంది.. మిగిలిన వాళ్లకు లేదు అనుకోవడం పొరపాటు. జేసీ.. ఫ్లోలో ఏదో అలా మాట తూలారని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు రెడ్డి అంటే రొమ్ము విరుచుకుతిరిగే వాడని చెప్పారు. అంటే ఆయనలో కూడా తన కులం పట్ల అభిమానం ఫుల్లుగా ఉన్నట్లే కదా. జనం కులం, మతం, ప్రాంతం, వర్గం ప్రాతిపదికన ఓట్లేస్తున్నారు కదా? అంటే వేస్తారు. ముందుగా ఎవరైనా తమకు దగ్గరగా ఉన్న వారినే చూస్తారు. వారిలో సత్తా లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఇతరుల వైపు చూస్తారు. రాయలసీమ రెడ్లు కూడా జగన్‌ వెంట ఇలాగే నడిచారు. నడుస్తున్నారు. అయితే వారిలో కొందరు జగన్‌లో సరైన నాయకత్వ లక్షణాలు లేవనే ఉద్దేశంతో వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరుతున్నారు. ఒకవేళ అనూహ్యమైన సంఘటనలు ఏవైనా జరిగి జగన్‌ గెలిచారనుకోండి. అప్పుడు వీరంతా తిరిగి మళ్లీ వైసీపీ గూటికి చేరడానికి ఏమాత్రం సంకోచించరు.

1 Comment on రాయలసీమ రెడ్లపై జేసీ సంచలన వ్యాఖ్యలు.. విశ్లేషణ

  1. Thanks on your marvelous posting! I quite enjoyed reading it, you happen to be a great author.I
    will ensure that I bookmark your blog and definitely will come back in the future.
    I want to encourage you continue your great posts, have a nice
    morning!

Leave a Reply

Your email address will not be published.


*