జూనియర్‌ ఎన్టీఆర్‌కు అంత ఉందా?

జూనియర్‌ ఎన్టీఆర్‌ గ్రాఫ్‌ చూస్తే.. స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ లాగా ఉంటుంది. పైకి వెళుతుంది. కిందకు వస్తుంది. చిన్న వయసులోనే కెరటంలా దూసుకెచ్చాడు. వెండితెరను దున్నేశాడు. అదే సమయంలో ఆయన చేసిన కొన్ని పొరపాట్లు కెరీర్‌ను రిస్క్‌లో పెట్టాయి. ఆ పొరపాట్లను దిద్దుకుని మళ్లీ దారిలోకి రావడానికి ఐదేళ్లు పట్టింది. అదుర్స్ తరువాత బాక్సాఫీస్‌ను షేక్ చేసే హిట్ ఆయనకు మళ్లీ 2016లోనే వచ్చింది. కొరటాల శివ.. జూనియర్‌లో సహజంగా ఉన్న టాలెంట్‌ను వెలికితీశాడు. జనతా గ్యారేజ్‌తో యంగ్‌ టైగర్‌ను రూ.100 కోట్ల క్లబ్బులో చేర్చాడు.

తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌.. కాకినాడ వెళ్లాడు. ఇందుకోసం ఆయన రాజమండ్రి ఎయిర్‌పోర్టులో దిగారు. అక్కడ అభిమానుల తాకిడితో జూనియర్‌ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అప్పుడెప్పుడో తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా జూనియర్‌పై అభిమానం వెల్లువలా వచ్చింది. అఫ్‌కోర్స్ ఆ అభిమానం ఓట్ల రూపంలోకి అంతగా మళ్లలేదు. అందుకే వేర్వేరు కారణాలు ఉన్నాయనుకోండి. అభిమానాన్ని, రాజకీయాన్ని వేర్వేరుగా చూసే పరిణతి జనంలో వచ్చింది. ఈ పరిణతి వల్లే చిరంజీవి సీఎం కాలేకపోయారు. భవిష్యత్తులో సీఎం పీఠంపై కూర్చోవాలని ఆశిస్తున్న పవన్‌ కల్యాణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

జూనియర్‌లో దమ్ము టన్నులు టన్నులు ఉందనడంలో సందేహం లేదు. కానీ దమ్ము ఎంత ఉన్నా దానికి సరైన స్ట్రాటజీ కూడా తోడు కావాలి. లేకపోతే దమ్ము ఉపయోగం లేకుండా పోతోంది. అదును చూసి పదును వ్యూహాలతో ముందుకెళితేనే రాణిస్తారు. అది సినిమా అయినా.. రాజకీయం అయినా. ఒకటి రెండు పొరపాట్లు లేదా తప్పులు పెద్దగా సమస్య సృష్టించకపోవచ్చు గానీ.. పదే పదే తప్పులు, పొరపాట్లు చేసుకుంటూ పోతే నష్టపోవాల్సి వస్తుంది. ఐదేళ్ల పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇలాగే నష్టపోయారు. భవిష్యత్తులో ఇలా జరగ్గకుండా చరిత్రను తిరగరాసే విజయాలు అందుకుంటారని ఆశిద్దాం.

ఈ వార్తకు సంబంధించిన వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*