కొడాలి నాని అష్ట దిగ్బంధనం..

జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రియ స్నేహితుడైన కొడాలి నానికి ఇప్పుడు కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఆయనను అన్ని వైపుల నుంచి ముట్టడిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నాని అలియాస్‌ శ్రీవెంకటేశ్వరరావుకు చెక్‌ పెట్టేందుకు టీడీపీ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.
ఒకప్పుడు నాని టీడీపీ లీడరే. కానీ కాలక్రమంలో జూనియర్‌కు, చంద్రబాబుకు తేడాలు రావడంతో నాని.. వైసీపీలో చేరారు. చేరిన వ్యక్తి సైలెంట్‌గా ఉండలేదు. చంద్రబాబును ఇష్టమొచ్చినట్లు తిట్టారు. బహుశా.. కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా బాబును అలా తిట్టి ఉండరు. ఇక చంద్రబాబు కథ ముగిసిపోయిందనే ఉద్దేశంతో నాని రెచ్చిపోయారు.

తీరా 2014లో నాని ఆశించిన దానికి భిన్నంగా జరిగింది. అయితే కృష్ణా జిల్లాలో వైసీపీ.. టీడీపీతో పోటా పోటీగా నిలిచింది. ఐదు స్థానాలను గెలిచింది. ఐదుగురిలో నాని ఒకరు. ఇప్పుడీ ఐదుగురిలో జలీల్‌ ఖాన్‌(విజయవాడ వెస్ట్‌), ఉప్పులేటి కల్పన(పామర్రు) టీడీపీలో చేరిపోయారు. నాని కూడా టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారనే వార్తలు వచ్చాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను తిరిగి తెలుగుదేశంలోకి చేర్చుకోకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. చేర్చుకోకపోవడంతో పాటు 2019లో నానిని ఓడించేందుకు బాబు వ్యూహ రచన చేస్తున్నారు.

గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యమైన నేతలందరిని టీడీపీలోకి లాగేసుకుంటున్నారు. నాని కీలక అనుచరుడు, గుడివాడ మున్సిపల్‌ ఛైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు టీడీపీలో చేరారు. గుడివాడ కిందకు వచ్చే నందివాడ మండలానికి చెందిన ఆప్కాబ్‌ ఛైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరారావు టీడీపీలో చేరారు. గుడివాడ రూరల్‌ మండలానికి చెందిన గుత్తా శివరామకృష్ణను తూర్పు కృష్ణా డెల్టా కమిటీకి ఛైర్మన్‌ను చేశారు. గుడ్లవల్లేరు మండలానికి చెందిన సీఎల్‌ వెంకట్రావును స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌కు వైస్‌ ఛైర్మన్‌ను చేశారు.

మరోవైపు గుడివాడలో అభివృద్ధి కార్యక్రమాలను జోరుగా చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. అటు రాజకీయంగా, ఇటు అభివృద్ధి పరంగా కూడా ప్రజలను నాని వైపు నుంచి సైకిల్‌ వైపు లాగే ప్రయత్నాల్లో టీడీపీ నేతలు ఉన్నారు. అలాగే టీడీపీలో వర్గ పోరు కూడా లేకుండా చేసే బాధ్యతను బుద్ధా వెంకన్నకు అప్పగించారు.

గుడివాడలో నానికి వ్యక్తిగత బలం ఎక్కువ. ఒంటరిగా పోటీ చేసినా ఆయన భారీ స్థాయిలో ఓట్లు సాధిస్తారు. ఈ బలాన్ని బలహీనపరిచేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా? అన్నది 2019లో గానీ తేలదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*